ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ పై ప్రస్తుతం ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసింది. జులై 1వ తేదీన వాలంటీర్లు లేకున్న పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. దీంతో వాలంటీర్లు కొనసాగిస్తారా? లేదా? అన్న సందిగ్ధత రాష్ట్రంలో నెలకొంది.
ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వాలంటీర్ల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వాలంటీర్లకు ప్రభుత్వం 2 నెలలుగా జీతాలు ఇస్తూనే ఉంది. వారి వల్లే పెన్షన్లు అందించగలమని’ వైసీపీ చేసిన వాదన తప్పని మా ప్రభుత్వం నిరూపించిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వా లంటీర్లను అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని వృధా చేసిందని చెప్పారు. ఒకటిరెండు రోజుల్లో పంచే పెన్షన్లను వైసీపీ ప్రభుత్వం నాలుగైదు రోజులు పంచేదని విమర్శించారు. వాలంటీర్లు అధైర్యపడొద్దు అని, వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పారు.