“రాష్ట్రంలో మేం ప్రధాన ప్రత్యామ్నాయం. అటు చంద్రబాబుకు, ఇటు జగన్‌కు కూడా మేమే రాజకీయంగా ప్రత్యర్థులం. మేం ప్రశ్నించడం వల్లే.. గతంలో చంద్రబాబు రాజధాని రైతులకు మేలు చేశారు. మేం మద్దతు ఇచ్చినందుకే ఆయన 2014లో అధికారంలోకి వచ్చారు. కానీ, ఇప్పుడు మమ్మల్ని ఎదగనీయకుండా కుట్రలు చేస్తున్నారు.“- ఇదీ.. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తాజాగా చేసిన వ్యాఖ్య. దీంతో నిజంగానే జనసేన అంత బలహీనంగా ఉందా? ఎవరో తొక్కేస్తే.. తొక్కబడి పోయే పరిస్థితిని ఎదుర్కొంటోందా? అనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి.
పార్టీ ఆవిర్భావం మాట పక్కన పెడితే.. గడిచిన ఏడాది ఎన్నికలు జనసేనకు అత్యంత కీలకం. అయితే, ఈ ఎన్నికల్లో పార్టీ సాధించిన సీట్లు కేవలం ఒకే ఒక్కటి. మరి దీనిని ఎవరు బాధ్యులు? ఎవరు తొక్కేస్తే.. 175 నియోజకవర్గాల్లో 174 చోట్ల పార్టీ ఓడిపోయింది ? నిజానికి పార్టీకి అభ్యర్థులు కూడా కరువయ్యారు. దీంతో దాదాపు 46 స్థానాలను పిలిచి పక్కపార్టీలకు ఇవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ.. పార్టీ సాధించిన విజయం ఏమాత్రం ఉందో తెలుస్తూనే ఉంది. ఇక, ప్రధానంగా పార్టీ అధినేత పవనే రెండు స్థానాల్లో పోటీ చేసి ఒక్కచోట కూడా విజయం సాధించలేక పోయారు. ఈ పరిణామాలు.. ఎవరు తొక్కేస్తే.. చోటు చేసుకున్నాయి ?
సంస్థాగత లోపాలు.. ఒక స్టాండ్ లేకపోవడం.. ప్రజల్లో విశ్వసనీయతను ప్రోది చేసుకోలేక పోవడం వంటి పరిణామాలు పార్టీని నానా విధాలుగా భ్రష్టు పట్టించాయి. ఎప్పుడు ఎవరిని విమర్శించాలో.. ఎప్పుడు ఎలాంటి రాజకీయాలు చేయాలో తెలియని వ్యూహా లోపం స్పష్టంగా కనిపించడం, ముఖ్యంగా యువతను ఆకర్షించడంలోనూ చోటు చేసుకున్న వైఫల్యాలు వంటి పార్టీని నిలువునా పాతిపెట్టాయి.
వాటిపై సోధనలు చేయడం, సరిదిద్దుకోవడం మానేసి.. ఇప్పుడు.. ఎవరో తొక్కేస్తున్నారని భావించడం, ఎదురు విమర్శలు చేయడం వంటివి ఆడలేక.. మద్దెల ఓడు.. అన్న పాత సామెతను గుర్తు చేసుకోవడమే. మేధావులను కూడా నిలుపుకోలేని పార్టీగా చరిత్ర సృష్టించిన పార్టీలో ఇప్పుడు కావాల్సింది ప్రతి విమర్శలా.. ఆత్మావలోకనమా? ఆలోచించుకుంటే.. ఎదుగుతారు సార్!! అంటున్నారు పరిశీలకులు.