ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ట్రిపుల్ ఐటీ లక్నోలో చదవాలనుకున్న ఓ పేద విద్యార్థి కలను నెరవేర్చారు. విద్యార్థి మొదటి సెమిస్టర్‌కు ఆర్థిక సాయంగా లక్షా 16 వేల రూపాయల చెక్కును పంపించారు. ఈ చెక్కును స్థానిక టీడీపీ కార్యాలయంలో మంత్రి సహకారంతో విద్యార్థికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అందజేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కె.సముద్రపు గట్టుకు చెందిన విద్యార్థి బసవయ్య ట్రిపుల్ లక్నో సీట్ లభించింది. కోర్సు ఫీజ్ సుమారు రూ.4లక్షలు ఉండగా.. అంత చెల్లించులేని పరిస్థితి అతని కుటుంబానిది. ఈ నెల 4వ తేదీన విద్యార్థి బసవయ్య తన సమస్య గురించి నారా లోకేశ్‌కు ఎక్స్ వేదికగా తెలియజేయగా.. గంటలోనే మంత్రి సానుకూలంగా స్పందించి భరోసా కల్పించారు. లోకేశ్ రీట్వీట్ చేస్తూ.. ఫీజు గురించి ఆలోచించకుండా చదువు మీద దృష్టి పెట్టాలని బసవయ్యకు సూచించారు. లోకేశ్ కార్యాలయం నుంచి సిబ్బంది బసవయ్యను సంప్రదించి వివరాలు తీసుకుని తాజాగా ఆర్థిక సాయం చేశారు.