ఆ మంత్రి వివాద రహితుడు. ఎవరు ఆయన ఇంటికి వెళ్లినా.. భోజనం పెట్టి పంపిస్తారు. వారి కష్టసుఖాలు తెలుసుకుంటారు. సమస్య ఉందని చెబితే.. పూర్తిగా వింటారు. డైరీలో రాసుకుంటారు. తప్పకుండా పరిష్కరిస్తానని హామీ కూడా ఇస్తారు. కానీ, తీరా ఎన్ని రోజులు గడిచినా.. ఆ సమస్య అక్కడే ఉంటుంది. ఆయన ఏమీ స్పందించరు. సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లరు. మరీ ముఖ్యంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మైనార్టీ నాయకుల సమస్యలను కూడా ఆయన విని.. వదిలేస్తారు. దీంతో ఇప్పుడు ఆయనకు సొంత పార్టీలోనే సెగ ప్రారంభమైంది.
ఇంతకీ,.. ఆయనెవరోకాదు.. సీఎం జగన్ సొంత జిల్లాలో పనిగట్టుకుని మంత్రి పదవి ఇచ్చిన నాయకుడు మైనార్టీ నేత అంజాద్ బాషా. గత ప్రభుత్వం మైనార్టీలకు ఏవో కొన్ని పథకాలను అమలు చేసింది. అయితే, జగన్ వచ్చిన తర్వాత వాటి స్థానంలో కొత్తవి తెచ్చారు. మైనార్టీ కమిషన్‌కు జవసత్వాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ, నిధుల సమస్య కారణంగా వాటిని తీర్చలేక పోయారు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. దీంతో జిల్లాలో మంత్రిపై ఒత్తిడి పెరిగింది. అయితే, వాటిని రాసుకుంటున్నా.. వాటిని పరిష్కరించే విషయంలో మాత్రం అంజాద్ బాషా చొరవ చూపించలేక పోతున్నారు.
దీంతో ఇప్పుడు జిల్లాలోని మైనార్టీ నేతలు.. ఈయనతో మేం పడలేక పోతున్నాం.. ఒక్కటంటే ఒక్క పనికూడా కావడం లేదు. వివాద రహితుడు అయినంత మాత్రాన పనులు చేయకపోతే ఎలా.. వెంటనే మార్చాలి! అని డిమాండ్లు తీసుకువచ్చారు. మీరు ఎవరికైనా ఇవ్వండి.. ఈయన మాత్రం మాకు వద్దు.. అని ఖచ్చితంగా తేల్చి చెబుతున్నారట. కానీ, ఈయనకు.. సీఎం జగన్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు మార్చడం సాధ్యం కాదని.. జిల్లాలోని కీలక నేతలు సర్ది చెబుతున్నారని స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇదే విషయంపై జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ కూడా ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతూ.. టైం వచ్చినప్పుడు జగనే చూసుకుంటారు..! అని వ్యాఖ్యానించారంటే.. పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు అంటున్నారు పరిశీలకులు. నిజమే కదా.. తనకుతాను క్లీన్‌గా ఉన్నానని చెప్పుకొంటే చాలదు. ప్రజలకు తనను నమ్ముకున్న సామాజిక వర్గానికి ఏదైనా చేయాలి కదా ? అంటున్నారు.
– vuyyuru subhash