కడప: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం కడపలో అంగన్వాడీలు 36 గంటల నిరవధిక దీక్షకు దిగారు. కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి అంగన్వాడీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే గఫూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కంటే వెయ్యి రూపాయల జీతం అదనంగా ఇస్తానన్న జగన్ రెడ్డి మాట తప్పడం మడమ తిప్పడమేనన్నారు.
మహిళలు శపించిన ప్రభుత్వం ఎప్పటికీ అధికారంలోకి తిరిగి రాదన్నారు. ఇందుకు ఉదాహరణ గతంలో టిడిపి ప్రభుత్వం అధికారం కోల్పోవడమేనన్నారు. ఒక్కో అంగన్వాడీ పరిధిలో 200 మంది ఓటర్లు ఉంటారని.. అంగన్వాడీలు తలుచుకుంటే ప్రభుత్వలే మారుతాయన్నారు. అంగన్వాడీల ఉసురుపోసుకున్న ఏ ప్రభుత్వం బ్రతికి బట్ట కట్టలేదన్నారు గఫూర్. రానున్న ఆరు నెలల్లో అంగన్వాడీల సత్తా ఏంటో చూపుతామన్నారు.