ఏపీ ఎలక్షన్స్ కు రంగం సిద్ధమైంది. ఎవరి ప్రచార వ్యూహాలను వారు సంధిస్తున్నారు. ఇక ఈసారి జనసేన- టీడీపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. తాజాగా నేడు తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభ అయిన తెలుగు జన విజయకేతన జెండా సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్.. రెండు తెలుగు రాష్ట్రాలను హీటెక్కిస్తున్నాయి. ఎప్పుడు లేనంతగా పవన్ ఈ సభలో గంభీరంగా, ఎమోషనల్ గా మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అధికార పక్షం పై పవన్ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక వారితో పాటు.. తన సొంత అభిమానులే తనను మాటలు అంటున్న నేపథ్యంలో దానికి కూడా సమాధానం ఇచ్చాడు. ప్రజల సమస్యల కోసం తాను కోట్లు వదిలేసి రాజకీయాల్లోకి వస్తే.. రెండుచోట్ల ఓడించారని గుర్తుచేశాడు. అభిమానులు అని చెప్తూనే తనకు ఓటు వేయలేదని, అయినా తనకు బాధగా లేదని తెలిపాడు.
“నా అభిమానులకు కూడా చెప్తున్నాను. నన్ను కాదని మీరు జగన్ కు ఓటు వేశారు.. మర్చిపోను. ఈరోజు మీరు నఫర్ అవుతున్నారు.. నేను కాదు. మీ భవిష్యత్తు కోసం వచ్చాను నేను రోడ్ల మీదకు. శుభ్రంగా కోట్లు సంపాదించుకొనే మార్గాలు ఉన్నాయి నా దగ్గర. యాక్టింగ్ స్కిల్ ఉన్నాయి. అన్ని కాదనుకొని ఎందుకు వచ్చానంటే.. అరే నా నేలనే.. నా మనుషులే.. మనవాళ్లే.. తపనపడి, తపన పడితే రెండుచోట్ల ఓడిపోయాను. బాధ లేదు. నిలబడ్డాను. రెండుచోట్ల ఓటమి బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా.. ? ఒక పరీక్ష పోతే బాధ ఎలా ఉంటుందో ఒక విద్యార్థికి తెలుసు. అలాంటింది నే రెండు చోట్ల ఓడిపోతే.. నేను నిరాశ, నైరాశ్యం. బాధ ఉంది.. ఒకటే గుర్తుపెట్టుకున్నా.. దక్షిణాఫ్రికాలో ట్రైన్ లో నుంచి గెంటివేయబడ్డ గాంధీ గారు గుర్తొచ్చారు. ఎలాంటి ఆటుపోట్లు తీసుకోకుండా పార్టీని నడపలేను, అవమానాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళలేను. వారందరిని స్మరించుకొని, వారి స్ఫూర్తితోటి ఈరోజు నిలబడి ఉన్నాను. బలంగా నిలబడి ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.