ఏపీలో కరోనా వివ్వరూపం దాల్చుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ టైమ్‌లో ఆక్సిజన్ కొరత ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం. ఏ మాత్రం ఆక్సిజన్ ఆడకపోయినా.. ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. అయితే ఏపీలోని ఓ ఆస్పత్రిలో రాత్రి ఆక్సిజన్ అయిపోగా.. పోలీసులు ఆపద్భాంధవులలాగా ఆక్సిజన్ ను నిముషాల్లోనే సమకూర్చి 30మంది ప్రాణాలు కాపాడారు.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని కానూరులో గల టైమ్స్ హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆ టైమ్ కు అందులో వెంటిలేటర్‌పై 30మంది ఉన్నారు. బుధవారం రాత్రి 9గంటల వరకే ఆక్సిజన్ సరిపోయేలా ఉంది. దీంతో అంతా గందరగోళంగా మారింది. ఏ క్షణంలో ఆక్సిజన్ అయిపోతుందో అని అంతా ఊపిరి బిగబట్టుకొని సాయం కోసం ఎదురు చూశారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ ముత్యాల సత్యనారాయణ వెంటనే రంగంలోకి దిగారు. విషయాన్ని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, జేసీ శివశంకర్ కు వివరించారు. కాగా వెంటనే జిల్లాలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సిలెండర్ల వివరాలను సేకరించి.. రాత్రి 8గంటల్లోపు యుద్ధ ప్రాతిపదికన చేరవేర్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పోలీసులకు సెల్యూట్ చేస్తున్నారు.