ఏపీలోని విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా ప్రబలి పలువురు మృతి చెందగా.. 100 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా నేడు గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఘటనకు గల కారణాలపై గ్రామస్తులతో మాట్లాడిన ఆయన.. గుర్ల తాగునీటి పథకాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు.
గుర్లకు తాగునీరు అందించే చంపావతి నీరు కలుషితం అయిన విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారించామని, ఈ ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ను విచారణకు నియమించామని పేర్కొన్నారు. విచారణ అనంతరం ప్రభుత్వం తరపున పరిహారం అందిస్తామని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు తాను వ్యక్తి గతంగా రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ఈ సందర్భంగా పవన్ ప్రకటించారు.