స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు వెళ్లి బయటకు వచ్చిన టీడీపీ అధినేత ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన పుణ్య క్షేత్రాల సందర్శన చేశారు. ఒక ఆ తర్వాత నుంచి పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు, దేశ రాజకీయాలను ఆయన పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పవన్ చంద్రబాబుతో భేటీ అయ్యారు.
ఈ భేటీలో ఇరువురు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. తెలుగుదేశం-జనసేన పార్టీల పొత్తు ప్రక్రియను వేగవంతం చేయడంపైనే సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. జిల్లాలు, నియోజకవర్గాల స్థాయిల్లో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించుకోవడం, ఉమ్మడి మినీ మేనిఫెస్టో ప్రకటించడం వంటి పరిణామాలు గత నెలరోజుల్లో వేగంగా చోటుచేసుకున్నాయి.
తాజా భేటీలో సీట్ల కేటాయింపు అంశం చర్చకు వచ్చిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. చంద్రబాబు-పవన్ కల్యాణ్ ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తారని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో ఓటమి భయంతో వైసీపీ ఓట్ల అక్రమాలకు పాల్పడుతోందనే అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న తెలుగుదేశం దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని యోచిస్తోంది. ఆ దిశగా ఐక్యపోరాటంపై చంద్రబాబు-పవన్ మధ్య చర్చ జరిగి ఉండవచ్చని సమాచారం.