కార్యకర్తలకు పెద్ద పరీక్షే పడుతున్న పవన్… జరిగేపనేనా?

-

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. కచ్చితంగా నిలబడతాడు, నిరూపించుకుంటాడు, సాధిస్తాడు అని చాలా మంది అభిమానులు భావించారు. కానీ అనంతర పరిణామాల్లో టీడీపీ పక్కన నిలబడటం, తాను బాబు మనిషినని నిరూపించుకునే పనులు చేయ్యడం, నాడు ప్రతిపక్షంలో ఉన్న వైకాపాను సాధించడం చేశారు పవన్. టీడీపీతో ఆ బంధం కూడా పోయేసరికి.. ప్రస్తుతం బీజేపీతో కలిసి ఉంటున్నారు! ప్రస్తుతం పూర్తిగా బీజేపీ మనిషిలాగా మారిపోయారు పవన్! ఈ క్రమంలో తన కార్యకర్తలను కూడా అలానే మారిపోమంటున్నారు!

తాజాగా ఒక ప్రకటనలో పవన్… కరోనాతో తలెత్తిన ఇక్కట్ల నుంచి గట్టెక్కించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న ఆర్థిక ఉపశమన చర్యలు మధ్యతరగతికి భరోసానిచ్చేలా ఉన్నాయని చెప్పారు. మిత్రపక్షం కాబట్టి పవన్ ఆస్థాయిలో స్పందించడంలో తప్పు లేదు అని కాసేపు అనుకుంటే… ఈ సమయంలో జనసైనికులకు పరీక్ష పెడుతున్నారు పవన్! నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇలాంటి పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని జనసేన కార్యకర్తలకు పవన్ పిలుపునిస్తున్నారు. మోదీ తీసుకొచ్చిన పథకాలు, వాటి ప్రయోజనాలు వంటి విషయాలను జనసేన శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెబుతున్నారు.

కొంతమంది జనసైనికులు ఓపెన్ గా చెప్పేదేమిటంటే… పవన్ – బీజేపీతో కలవడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని! ఆ కలయికను తాము ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నామని! కరోనా సమయంలో కూడా… జనసైనికులు చేస్తున్న సహాయ కార్యక్రమాలలో బీజేపీ జనాలను కూడా కలుపుకుపోవాలని, వారి జెండాలు కూడా కనిపించాలన్నట్లుగా పవన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే! అప్పుడు కూడా జనసేన కార్యకర్తలు పవన్ మాటను పెద్దగా పట్టించుకుంది లేదు. జనసేన కోసం చెప్పండి… ఎంతైనా చేస్తాం.. ఏమైనా చేస్తాం.. అంతే కానీ… తమ కష్టంలో బీజేపీకి వాటాఇవ్వమంటే మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెప్పినంత పనిచేశారు.

ఇప్పుడు తాజాగా బీజేపీ ప్రచార బాధ్యతలను జనసేన కార్యకర్తలు తమ భుజాలపై వేసుకోవాలని పవన్ కోరడంపై జనసైనికులు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. కరోనా సమయంలో సహాయ కార్యక్రమాల్లో కలుపుకోమంటేనే ససేమిరా అన్న జనసైనికులు… ఇప్పుడు ఏకంగా ఊరూరా తిరిగి బీజేపీకి బాకా ఊదమంటే ఎలా రియాక్ట్ అవుతారు? అసలు పవన్ మాట వింటారా? నాయకులు కలిసినంత సులువు కాదుగా… కార్యకర్తలు కలవడం, సర్ధుకు పోవడం!

Read more RELATED
Recommended to you

Exit mobile version