పింగళి వెంకయ్య సేవలకు గుర్తింపుగా భారతరత్న ప్రకటించాలి-పవన్ కళ్యాణ్

-

పింగళి వెంకయ్య సేవలకు గుర్తింపుగా భారతరత్న ప్రకటించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్‌ చేశారు. తెలుగు కీర్తి పతాక శ్రీ పింగళి వెంకయ్య మూడు వర్ణాలతో మురిపించే భారత జాతీయ పతాకం రూపొందించారని.. భారతీయుల ఏకత్వానికి, శౌర్యానికి, స్వాభిమానానికి, సార్వభౌమత్వానికి, సమున్నతకి ప్రతీక అన్నారు. మన త్రివర్ణ పతాకాన్ని వీక్షించిన మరుక్షణం శరీరం రోమాంచితం కాని భారతీయులు ఉండరంటే అది అతిశయోక్తి కాదని.. అంతటి శక్తి కలిగిన పతాకాన్ని రూపొందించిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య చరితార్థుడని వెల్లడించారు.

ఆ పతాక తపశ్శాలి తెలుగు గడ్డపై జన్మించడం తెలుగు జాతి పుణ్యఫలమని.. ఆ మహానుభావుని 146వ జయంతి సందర్భాన నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నాననని వెల్లడించారు. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న శుభతరుణంలో జాతి యావత్తు వజ్రోత్సవాలు జరుపుకోడానికి సమాయత్తమవుతున్న వేళ స్వర్గీయ పింగళి వెంకయ్య జయంతి కూడా జరగడం యాదృచ్చికమే అయినా అదొక మరుపురాని మహత్తర ఘట్టం అని చెప్పారు.

దేశం పరాయిపాలనలో అరాచకాలను చవి చూస్తున్న తరుణంలో జాతిని ఏకం చేయడానికి దేశానికి ఒక పతాకం అవసరమని ఏళ్ల తరబడి ఘోషిస్తూ, శ్రమిస్తూ చివరికి ‘ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ అనే పుస్తకాన్ని రచించి, ప్రచురించారు పింగళి అని..తుదకు 1921 మార్చిలో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీజీ ఆశీస్సులతో పింగళి రూపొందించిన త్రివర్ణ పతాకం భారత జాతీయ పతాకంగా ఆమోదం పొందిందన్నారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version