అజ్ఞాతంలో పితాని ప్లాన్: ఆచంట కలచెదిరినట్లేనా?

-

కాంగ్రెస్ నుంచి ఒకసారి.. టీడీపీ నుంచి ఒకసారి గెలవడంతో పాటు మంత్రిగా కూడా పనిచేసిన పితాని సత్యనారాయణకు పశ్చిమగోదావరిజిల్లా ప్రజలతోపాటు, ప్రత్యేకంగా బీసీ సామాజికవర్గంలోనూ మంచి పేరుంది. 2009, 2014ల్లో ఒకసారి కాంగ్రెస్ నుంచి, అనంతరం టీడీపీ నుంచి గెలిచిన పితాని… తన కుమారుడికి మాత్రం సరైన రాజకీయ మార్గం ఏర్పాటుచేయలేదని ఫీలవుతూ ఉండేవారంట.

ఇందులో భాగంగా వైకాపా వచ్చిన తర్వాత యువకులను ప్రాధాన్యత పెరుగుతుంటుండటంతో… తాను వైకాపా తీర్ధం పుచ్చుకుని.. తనకుమారుడు వెంకట్ కి రాజకీయంగా మంచి పునాదీ వేద్దామని ప్లాన్ చేశారని చెబుతుంటారు స్థానిక ప్రజానికం! ఈ క్రమంలో తాజాగా ఈఎస్ఐ స్కాం వ్యవహారంలో పితాని వెంకట్ పాత్ర వెలుగులోకి వస్తోందన్న కథనాల నడుమ… ఇప్పుడు పితాని ప్లాన్స్ అన్నీ “అజ్ఞాతం”లో కలిసిపోయినట్లేననే కామెంట్లు వినిపిస్తున్నాయి!

రెండుసార్లు 2009లో కాంగ్రెస్ నుంచి సుమారు 15వేల ఓట్లతోనూ.. 2014లో టీడీపీ నుంచి నాలుగువేల పైచిలుకు ఓట్లతోనూ గెలిచారు. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో బీసీలకు, అందునా శెట్టిబలిజలకు పితాని పెద్ద దిక్కుగా మారారు! ఈ క్రమంలో అన్నీ అనుకూలంగా జరిగి.. ప్రస్తుత ఆచంట ఎమ్మెల్యే శ్రీరంగనాథ రాజు స్థానంలో వచ్చే ఎన్నికల్లో వైకాపా తరుపున పోటీచేయాలని తెగ ప్లాన్స్ వేశారు పితాని! పైగా అది తనకోసం కాకుండా… తన కుమారుడికోసం కేటాయింపచేసుకునేలా స్కెచ్ లు వేస్తూ.. నియోజకవర్గంలో కాస్త బలంగా తిరుగుతున్నారు. ఈ సమయంలో ఈఎస్ఐ రూపంలో పితాని కల చెదిరినట్లయ్యింది!

అవును… ఈఎస్‌ఐ స్కాం కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేశ్‌ ముందస్తు బెయిల్‌‌ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఫలితంగా ఆయన ఇంకా అజ్ఞాతానికే పరిమితం కావాల్సి వచ్చింది. దాంతో… ఈ కేసు విషయంలో వెంకట్ పాత్రపై వచ్చే తీర్పులను బట్టే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ ఈఎస్ఐ స్కాం కేసులో పితాని పుత్రరత్నం పాలతో కడిగిన ముత్యంలా.. అగ్ని పునీత సీతలా బయటపడతారా.. లేక అజ్ఞాతంతోనే సగం క్లారిటీ ఇచ్చినట్లుగా… నిజంగానే తండ్రి కలలు చెదరగొడతారా అనేది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Exit mobile version