సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అలాగే రాష్ట్రంలో రాజకీయాలు రాజుకుంటున్నాయి. నాటకీయ పరిణామాల మధ్య ఏపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ వ్యుహాలు రచిస్తుంటే.. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారం చేజిక్కించుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోంది.
కూటమి నేతలు ప్రచారంలో జోష్ ను పెంచారు. ఓవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కల్యాణ్, ఇంకోవైపు బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు కూటమి మరో ప్రయత్నం చేయనుంది. ప్రధాని మోదీతో రాష్ట్రంలో పలు బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మోదీ 4 బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న అనకాపల్లి, కడప, రాజంపేట, రాజమహేంద్రవరం నియోజకవర్గాల్లో ప్రధాని మోదీతో బహిరంగ సభలు నిర్వహించేలా కూటమి ప్రణాళిక చేస్తున్నట్లు తెలిసింది. ఈ బహిరంగ సభల్లో ప్రధాని మోదీతో పాటు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొంటారని సమాచారం.