ఈనెల 15వ తేదీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఆయన మార్చి 17వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఆ రోజున చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ – జనసేన – బీజేపీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ఈ సభ ద్వారా ఒకే వేదికపైకి మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రానున్నారు. పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికల బహిరంగ సభ కావడంతో మూడు పార్టీలూ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించాయి. టీడీపీ ఎక్కువ బాధ్యత తీసుకుని, పెద్దఎత్తున విజయవంతం చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తోంది. సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన మూడు పార్టీల ముఖ్య నేతలతో 13 కమిటీలను ఏర్పాటు చేశారు. సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయడంలో మూడు పార్టీల నేతలు దృష్టి సారిస్తున్నారు.