ఎనిమిదేళ్ల క్రితమే తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణానికి అనుమతులిచ్చామని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ జావడేకర్ అన్నారు. ఏ నగరాన్ని రాజధానిగా ఎంచుకోవాలనేది రాష్ట్ర ప్రజల నిర్ణయమని స్పష్టం చేశారు. జయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ‘మోదీ ఎట్‌ది రేట్ ఆఫ్ 20, డ్రీమ్ మీట్ డెలివరీ’ పుస్తకం గురించి వివరించే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
‘ఎనిమిదేళ్ల కిందట నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణానికి అనుమతులిచ్చాం. ఇప్పుడు అకస్మాత్తుగా విశాఖ తెరమీదికి వచ్చింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి… ఇది రాష్ట్ర సమస్య…!’ అని ప్రకాశ్ జావడేకర్ వ్యాఖ్యానించారు. ‘మన సంపద, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ప్రధాని మోదీ చేస్తున్న కృషి అభినందనీయం. ఏ రాష్ట్రమైనా కొత్తగా సంపద సృష్టించకుండా ఉన్నదాన్ని పంచుకుంటూ వెళితే… పేదరికమే మిగులుతుంది. పరిశ్రమలను స్థాపించి, ఉపాధి అవకాశాలను పెంచితే పేదరికం తగ్గుతుంది’ అని జావడేకర్ స్పష్టంచేశారు.