తనపై అభియోగాలు మోపుతూ ఎస్ఈసీ రాసిన లేఖకు సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్య నాధ్ దాస్ కు ప్రవీణ్ ప్రకాష్ వివరణతో కూడిన లేఖ రాశారు. నిబంధనల మేరకే వ్యవహరించాను తప్ప.. పరిధి దాటలేదని స్పష్టం చేసిన ప్రవీణ్ ప్రకాష్, తానెవర్నీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. అఖిల భారత సర్వీస్ అధికారులు నిబంధనల మేరకే విధులు నిర్వహిస్తారన్న ప్రవీణ్ ప్రకాష్ జనవరి 25న ఎస్ఈసీ రాసిన లేఖకు మరుసటి రోజే సమాధానం ఇచ్చానని అన్నారు.
ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ సీఎస్ ద్వారా జరపాలని ఎస్ఈసీని కోరానని, నేనెక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించానో ఇప్పటికీ నాకర్ధం కావడం లేదని అన్నారు. అంతే కాక స్వతంత్రంగా వ్యవహరించే అధికారం నాకు లేదని, సీఎస్ సూచనల మేరకే నేను నడుచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ పరిస్థితుల్లో నన్ను తప్పు పట్టడం ఎంత వరకు న్యాయం ? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల పై కోర్టుల్లో కేసులు నడుస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వ యంత్రాంగంలో గందరగోళం నివారించేందుకే యధాతథ స్థితి కొనసాగింపు కోసం యత్నించానని అన్నారు.