తమ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వేసే ఎత్తుగడలను టీడీపీ, జన సైనికులు తిప్పి కొట్టాలని రఘురామకృష్ణ రాజు గారు కోరారు. ప్రశాంత్ కిషోర్ తన టీం సభ్యులతో టీడీపీని, జనసేనను ట్రోల్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేయిస్తారని, దాన్ని టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు గుర్తించాలని అన్నారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గార్లు తీసుకునే నిర్ణయాలకు, రాష్ట్రంలోని పార్టీ శ్రేణులు కట్టుబడి ఉండాలని అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎలా ఉన్నప్పటికీ, కేంద్రంలో బీజేపీ నాయకత్వం పటిష్టంగా ఉందని అన్నారు. పసుపు, ఎరుపు రంగులు కలిస్తే కాషాయ రంగు ఏర్పడుతుందని, ఒంటికి ఇంటికి వేస్తున్న ఆ మూడు రంగులను తుడిపేసి, కాషాయ రంగును వేయిద్దాం అని అన్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సఖ్యత ఉండాలని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జగన్ మోహన్ రెడ్డి గారు బస్మీ పటలం చేశారని, గత నాలుగు ఏళ్లలో ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన జగన్ మోహన్ రెడ్డి గారు, బటన్ నొక్కుడు ద్వారా ఇచ్చింది ఎంత అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయంలో టిడ్కో ఇల్లు 90 శాతం పూర్తి కాగా అదనంగా ఒక్క స్లాబు కూడా వేయని జగన్ మోహన్ రెడ్డి గారు, జగనన్న గృహాలు అని, హ్యాపీ హోమ్స్ అంటూ రంగులు వేసి బిల్డప్పులు ఇస్తున్నారని రఘురామకృష్ణ రాజు గారు మండిపడ్డారు.