జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత నూతనంగా ఏర్పడే ప్రభుత్వం మద్యపాన ప్రియులకు నాణ్యమైన మద్యాన్ని అందించి, రేట్లు తగ్గించాలని భావించినా అది కుదిరే పని కాదని రఘురామకృష్ణ రాజు తెలిపారు. రానున్న 13 ఏళ్లలో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికే అప్పు చేసిందని, సంక్షేమ పథకాల పేరిట జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్న నగదు ప్రజల కష్టార్జితమేనని… అది ప్రజల సొమ్మేనని, ప్రజల కష్టాన్ని మద్యం పేరిట తాకట్టు పెట్టి, ప్రజల తోటే తీసుకున్న అప్పుకు జమోరె గారు వాయిదాలను కట్టిస్తున్నారని అన్నారు.
ప్రజల ఆదాయాన్ని కొల్లగొట్టి రాజకీయ నేతలు సగం తినగా మిగిలిన డబ్బులను సంక్షేమ పథకాల పేరిట ప్రజలకు పంచుతున్నారని అన్నారు. భవిష్యత్తులో మద్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది లేదని, ప్రజలకు సంక్షేమ పథకాల పేరిట జగన్ మోహన్ రెడ్డి గారు నగదు ఇచ్చేది లేదని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు. మగువల భర్తల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి, మా దగ్గర ఇంత మంది తాగుబోతులు ఉన్నారని చెప్పి, తాగుబోతుల నుంచి తనకు ఇంత ఆదాయం లభిస్తుందని, మద్యం ధరలను పెంచి, మద్యపాన ప్రియుల చేత తాగిపించి… మహిళల పుస్తెలను తాకట్టు పెట్టి అడ్డగోలుగా అప్పులు తెచ్చి, దానిలో సగం డబ్బులు కొట్టేసి… చిల్లర మెతుకులను జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు విసురుతున్నారని రఘురామకృష్ణ రాజు గారు విరుచుకపడ్డారు. రానున్న పదేళ్ల ఆదాయాన్ని ఈ సంవత్సరమే జగన్ మోహన్ రెడ్డి గారు కొల్లగొట్టాడంటే, రానున్న పదేళ్లు ఆదాయం హుష్ కాకి అవుతుంది అని స్పష్టం అవుతుందని అన్నారు.