ఇద్దరు క్రిమినల్స్ బ్రెయిన్ చైల్డ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థ అని, ప్రజల సొమ్ముతో తమ పార్టీ పనులు చేయించుకోవడానికి ఈ వ్యవస్థను సృష్టించారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. ఈ వ్యవస్థ సృష్టికర్తలలో ఒక క్రిమినల్ రాజకీయ సలహాదారుడైతే, మరొకరు ఎవరో తాను చెప్పను, ప్రజల ఊహకే వదిలేస్తున్నానని అన్నారు. నిస్సందేహంగా ఇది ఒక క్రిమినల్ యాక్ట్ అని, ఈ వ్యవస్థపై ప్రజల్లో తిరుగుబాటు రావాలని, వృద్ధాప్య పింఛన్లను పొందే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో నేరుగా సొమ్ము జమ కావడం సుఖమా?, వాలంటీర్ ఇంటికి వచ్చి వెదవ సొల్లు కబుర్లు చెప్పి డబ్బులు అందజేయడం అనేది సుఖమా?? అన్నది లబ్ధిదారులు ఆలోచించాలని, ఈ వ్యవస్థ వల్ల న్యూ సెన్స్ తప్పితే మరొకటి లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కుండ బద్దలు కొట్టారు.
బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని రాజకీయ పార్టీలు చెబుతున్నప్పటికీ, ఈ వ్యవస్థ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని, తాను నిక్కచ్చిగా మాట్లాడుతున్నానని, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, ఈ వ్యవస్థ లోని లోపాలపై ఎవరితోనైనా బహిరంగంగా చర్చించడానికి తాను సిద్ధమేనని సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థీకృత నేర బృందంగా తయారయిందని, గతంలో రేషన్ పంపిణీ వ్యవస్థ అనేది చౌక ధర దుకాణాల ద్వారా సజావుగా సాగేదని, ఇప్పుడు ప్రజలకు రేషన్ అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వాహనాలను కొనుగోలు చేసి, ఆ వాహనాలలో గంజాయి సరఫరా అవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు.