ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, గవర్నర్ గారి పాలన విధించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కోరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాలకుల హింసాకాండ దిన దినాభివృద్ధి కాదు… క్షణక్షణం అభివృద్ధి చెందుతోందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగడానికి జగన్ మోహన్ రెడ్డి గారి సర్కార్ కు అర్హత ఉందా? అని ప్రశ్నించారు. నిజాయితీగా, శాంతియుత వాతావరణంలో ఈ ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించగలదా?? అంటూ నిలదీశారు.
అనంతపురం జిల్లా రాప్తాడులో వైకాపా నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో, సభా ప్రాంగణం నుంచి వెళ్ళిపోతున్న సభికుల ఫోటోలను తీసినందుకు ఒక ఫోటో జర్నలిస్టుపై దాడి చేసి, కొంతమంది అల్లరి మూక చితక బాదారని, కర్నూలులోని ఈనాడు దినపత్రిక కార్యాలయంపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి కంప్యూటర్లను ధ్వంసం చేసి, అద్దాలను బద్దలు కొట్టారని, ప్రభుత్వం స్పాన్సర్లు చేయకపోతే ఇటువంటి దాడులు జరగవని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడవద్దని, ఆయన విచ్చలవిడిగా మాట్లాడుతుండడం వల్లే మీడియాపై దాడులు జరుగుతున్నాయని అన్నారు.