బంగాళాఖాతంలో తుఫాన్ గా మారుతున్న తీవ్రవాయుగుండం..!

-

ఐఎండి సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 3కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ప్రస్తుతానికి ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 130 కి.మీ, నాగపట్నానికి ఆగ్నేయంగా 320 కి.మీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 480 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర-వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందన్నారు. ఇది శుక్రవారం ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. నవంబర్ 30వ తేదీ ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా గంటకు 50-60 కి.మీ గరిష్టంగా 70 కి.మీ ఈదురుగాలుల వేగంతో తీరం దాటే అవకాశం ఉందని వివరించారు.

దీని ప్రభావంతో రేపు,ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శుక్రవారం దక్షిణకోస్తా,రాయలసీమలో కొన్నిచోట్ల అతితీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ గరిష్టంగా 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version