మొదటి, రెండవ ప్రపంచ యుద్ధంతో పాటు, కురుక్షేత్రంలో మరణించిన వారి కంటే ఆంధ్రప్రదేశ్ లో మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య ఎక్కువని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. అమెరికా వియత్నాం యుద్ధంలో చనిపోయిన వారి కంటే, గాజా యుద్ధంలో మరణించిన వారి కంటే ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ లో నాసిరకం మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య ఎక్కువ అని బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గారు వెల్లడించారని గుర్తు చేశారు.
గత ప్రభుత్వం మాదిరిగా నాణ్యమైన మద్యాన్ని పంపిణీ చేయాలన్నారు. నాసిరకమైన మద్యం సేవించడం వల్ల ప్రజల ఇళ్ళు, ఒళ్ళు గుళ్ల అయిందన్నారు. దానికి డాక్టర్ వై.యస్.ఆర్. ఇళ్లు ఒళ్లు, గుళ్ల పథకం అని పేరు పెడతారో, లేకపోతే జగనన్న ఇళ్లు, ఒళ్ళు, గుళ్ల పథకం అని పేరు పెడతారోనని ఎద్దేవా చేశారు. వై ఏ పీ నిడ్స్ జగన్ అని సిగ్గు లేకుండా అధికారులను వెంటేసుకొని పనికిమాలిన వారు ప్రజలకు చెబుతారట అని అపహస్యం చేశారు. ప్రజల ఒళ్ళు గుళ్ల చేసిన వారు ఆంధ్ర ప్రదేశ్ కు అవసరమా? అని ప్రజలు ప్రశ్నించాలని రఘురామకృష్ణ రాజు గారు కోరారు. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి గారు తన తండ్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి పేరిట ప్రవేశపెట్టిన పథకాల గురించి తాను చదివి వినిపించానని, అయితే ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి జగనన్న ప్రాణవాయువు పథకాన్ని మరిచిపోయారని పేర్కొన్నారని తెలిపారు. భారతి సిమెంట్స్ నుంచి డబ్బులు తీసి ఇచ్చినట్లుగా ప్రకృతి ద్వారా లభించే ప్రాణవాయువుకు ‘జగనన్న ప్రాణవాయువు’ పథకం అని పేరు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.