మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తుది దశకు చేరుకోవడంతో, ఆ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేశారేమోనని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు. ఈ కేసులో కేసు డైరీ కీలకం కానుందని, కేసు డైరీ స్వీకరించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొనడంతో, ఎవరు ఎవరితో అర్ధరాత్రి తరువాత హత్య జరిగిన పిదప ప్రజలకు తెలియకుండా మాట్లాడుకున్నది కేసు డైరీలో సవివరంగా ఉందని అన్నారు.
దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ అక్రమ అరెస్టుల పర్వానికి తెరలేపి ఉంటారని, అక్టోబర్ 11వ తేదీన జరగనున్న వాదనలలో అన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని అన్నారు. ఇక ఈ కేసులో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం గారు తాను ఇచ్చిన 161 స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకోవద్దని పిటీషన్ దాఖలు చేశారని, అయితే ఈ పిటిషన్ కు కౌంటర్ గా సీబీఐ వాయిస్ రికార్డును కోర్టుకు సమర్పించిందని, అలాగే అవినాష్ రెడ్డి గారు కూడా తన 161 స్టేట్మెంట్ ను కూడా పరిగణలోకి తీసుకోవద్దంటూ కోర్టును అభ్యర్థించగా, దర్యాప్తు సంస్థ కౌంటర్ దాఖలు చేసిందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.
తన కళ్ళల్లోకి చూడాలంటే నిచ్చెన వేసుకుని చూడాల్సిన వ్యక్తులు అస్సాం… అస్సాం అంటూ తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు గారు క్వాష్ పిటిషన్ పై చట్ట ప్రకారం న్యాయం జరుగుతుందని ఆశించాం అని, అది ఆశ ఆడి ఆశ అయిందని, పై కోర్టుకు వెళ్తాం అని అన్నారు. హైకోర్టు తీర్పుపై స్పందించాలని ఒక విలేకరి తనను కోరగా… మైండ్ బ్లాంక్ అయింది… పై కోర్టుకు వెళ్లడమేనని చెప్పానని రఘురామకృష్ణ రాజు వెల్లడించారు.