వివేకా కేసులో నారా సుర రక్త చరిత్ర అని ఎందుకు రాశారు? అని ఫైర్ అయ్యారు రఘురామకృష్ణ రాజు. వై.యస్. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని అదే రోజు ఉదయం 7:45 నుంచి 8:30 గంటల మధ్యలో ఏడుపు ముఖంతో విజయసాయి రెడ్డి గారు మీడియాకు చెప్పారని, అయినా సాక్షి దినపత్రికలో మాత్రం నారాసుర రక్త చరిత్ర అని ఎందుకు రాశారని, వివేకా గారిని దారుణంగా హత్య చేసినప్పటికీ, గుండెపోటుతో మరణించారని సాక్షి మీడియా పదే పదే ఎందుకు చెప్పాల్సి వచ్చిందని, ఇదంతా పెద్ద కుట్ర అని, జగన్ మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసని అనుమానించడంలో తప్పేముంది? అని అన్నారు.
ఇదే విషయంపై అన్ని విషయాల గురించి మాట్లాడే సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వివరణ ఇస్తే బాగుంటుందని, అలాగే జగన్ మోహన్ రెడ్డి గారికి తన బాబాయి మరణ వార్త తెలిసే సమయానికి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం గారు అక్కడ లేరని చెప్పండని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఆయనకు ఒక ఉద్యోగం ఇచ్చామని చెబుతారా… చెప్పండి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి రఘురామకృష్ణ రాజు గారు సలహా ఇచ్చారు.
ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కొత్త పుంతలు తొక్కుతుందని, చిత్తశుద్ధి చూపిస్తున్నట్లు కనిపిస్తున్న సీబీఐకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈనెల 19వ తేదీన కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిఅరెస్టు ఖాయమని, దేశ రాజకీయాలలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని, ఎలాగైనా ఈ కేసు నుంచి తప్పించుకోవాలని జగన్ మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నట్లుగానే, తన తండ్రి హత్య కేసులో నిందితులకు జైలు శిక్ష పడాలని డాక్టర్ సునీత గారు న్యాయపోరాటం చేస్తున్నారని, స్వీయ రక్షణ కోసం జగన్ మోహన్ రెడ్డి గారు ఆరాటపడుతుండగా, ప్రజల ఆశీస్సులతో పోరాడుతున్న సునీత గారిదే అంతిమ విజయమని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.