మంత్రి రోజాపై వైసీపీ ఎంపీ సెటైర్లు

-

మంత్రి రోజాపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సెటైర్లు వేశారు. సినీ నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు రాఘవేంద్ర రావు సినిమాలు చేసుకోకుండా, రాజకీయాల గురించి మాట్లాడడం ఎందుకని వై.వి. సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణ రాజు గారు ఫైర్ అయ్యారు. అశ్వినీదత్ గారు గతంలో లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని, రాఘవేంద్ర రావు గారు టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించారని, రోజా రెడ్డి గారు సినీ హీరోయిన్ కాదా?, ఆమె సినిమాల్లో వేషాలు వేసుకోకుండా రాజకీయాల్లో ప్రవేశిస్తే మంత్రి పదవి కట్టబెట్టింది మన పార్టీ కాదా?, అని ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో నటుడు మోహన్ బాబు గారు కూడా మన పార్టీ తరపున ప్రచారాన్ని నిర్వహించారని, అప్పుడు మోహన్ బాబు గారిని సినిమాలు చేసుకోమ్మని చెప్పకుండా, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సుబ్బారెడ్డి గారు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. నటుడు పృథ్వి గారు కూడా మన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, ఆయనకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ చైర్మన్ పదవి కూడా కట్టబెట్టారని, సినీ నటుడు ఆలీ గారికి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెడతామని మోసం చేసి, ఇప్పుడు కార్పొరేషన్ పదవితో సరిపెట్టారని అన్నారు. వీరందరినీ సినిమాలు చేసుకొమ్మని చెప్పకుండా.. రాజకీయాలు ఎందుకని సుబ్బారెడ్డి గారు ప్రశ్నించ లేదో చెప్పాలని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డి గారి చిన్నాన హోదాలో ఏది మాట్లాడినా చెల్లుతుందనుకుంటే కరెక్ట్ కాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని సుబ్బారెడ్డి గారికి రఘురామకృష్ణ రాజు గారు హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version