ఉదయం, సాక్షి దినపత్రికలలో విలేకరిగా పనిచేసే, ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి గారికి సలహాదారుడిగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణా రెడ్డి, డాక్టర్ మిల్లెట్ రెడ్డిగా ప్రస్తుతం వైద్యశాస్త్రంలో కూడా తగినంత ప్రావీణ్యత సంపాదించినట్లు ఉన్నారని రఘురామకృష్ణ రాజు గారు ఎద్దేవా చేశారు. న్యాయస్థానంలో నిజమైన వైద్యులు అందజేసిన నివేదికను… న్యాయవాది నుంచి వైద్యుని అవతారం ఎత్తిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తప్పు పట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. కానీ వైద్యులు అందజేసిన నివేదికనే న్యాయమూర్తులు ప్రామాణికంగా తీసుకుంటారని తెలిపారు.
వైద్య శాస్త్రంలో పరిజ్ఞానం లేని వ్యక్తులు చేసే వాదనలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోదని అన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో రెండు కళ్ళకు శస్త్ర చికిత్స జరిగిందని, అలాగే ఏఐజి ఆసుపత్రి వైద్య బృందం ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారని తెలిపారు. ప్రతి వెధవ నోటికి వచ్చినట్లుగా వాగుతున్న తరుణంలో ఏడు సంవత్సరాల కింద ఆయనకు నెస్సల్ సర్జరీ చేసిన వైద్యుడు కూడా గుండెకు సంబంధించిన సమస్యను గుర్తించారని, ఆయన దానికి తగిన రీతిలో క్రమశిక్షణతో ముందు జాగ్రత్తలు తీసుకుండడం వల్ల గుండెకు సంబంధించిన సమస్య తీవ్రతరం కాకుండా అలాగే కొనసాగుతోందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.
వైద్యులు ఇచ్చిన నివేదిక బోగస్ అని, ఈసీజీ పరీక్ష చేస్తే తెలుస్తుందనడం చూస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్ కంటే ఆదిమానవుడు నయమని అనిపిస్తోందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఈసీజీ అంటేనే తప్పుల తడక అని, ప్రాథమిక రోగ నిర్ధారణ కోసమే ఈసీజీ పరీక్షలు చేస్తారన్నారు. గుండె లేని మనుషుల్లా అడ్డంగా వాదిస్తున్నారని, వారికి గుండె లేదు కాబట్టే గుండె నొప్పి గురించి వారికి తెలిసే అవకాశం లేదని ఎద్దేవా చేశారు. గొడ్డలి పోటుకు, గుండె పోటుకు పెద్దగా తేడా తెలియదని మనుషులు మీరు అంటూ రఘురామకృష్ణ రాజు గారు విరుచుకుపడ్డారు.