రాజధాని ఫైల్స్ సినిమాలో తాను కూడా నటించాల్సి ఉండగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టలేని పరిస్థితుల్లో ఈ సినిమాలో నటించలేపోయానని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ రాష్ట్రంలో నిర్వహించగా తాను ఢిల్లీలో ఉండడం వల్ల సినిమాలో నటించలేకపోయానన్నారు. అమరావతి ఫైల్స్ పేరుపై సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ సినిమా పేరును రాజధాని ఫైల్స్ గా నామకరణం చేశారని, ఈ సినిమా బాలరిష్టాలన్నీ దాటుకొని థియేటర్లలో ప్రదర్శించాల్సిన సమయంలో, ఎన్నికలు వస్తున్నాయి… ఈ సినిమా వల్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చేలా ఉందని వైకాపా తరఫున ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు.
గతంలో చంద్రబాబు నాయుడు గారికి కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు, బెయిల్ కాపీ జైలుకు ఎలా వెంటనే వెళ్లిందని కొంత మంది ప్రశ్నించారని, గురువారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు న్యాయస్థానం స్టే ఇస్తే, 11 గంటలకే షోను థియేటర్లలో ఎలా నిలిపి వేశారని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. సినిమా థియేటర్ల యజమానులు ఆర్డర్ కాపీ గురించి ప్రశ్నిస్తే వారిపై బెదిరింపులకు దిగారని, మల్టీప్లెక్స్ లలో సినిమా చూస్తుండడం కూడా ఆపివేశారని అన్నారు. 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తామని చెప్పుకునే సింగిల్ సింహం, రాజధాని ఫైల్స్ సినిమాను చూసి బెదురు చూపులు చూస్తూ పరిగెత్తాల్సి వచ్చిందని, జగన్ మోహన్ రెడ్డి గారు భయపడ్డారని అన్నారు.