తెలుగుదేశం, జనసేన పార్టీలకు కేటాయించిన పార్లమెంటు స్థానాల జాబితాలో నరసాపురం స్థానం లేదని, ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్లుగా స్పష్టమయ్యిందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. బీజేపీ అభ్యర్థిగా 24 నుంచి 48 గంటల వ్యవధిలో ఎవరెన్ని టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించినా కూటమి తరపున పోటీ చేస్తానని, నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన తనను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని జగన్ మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో పనిచేసే నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
జగన్ మోహన్ రెడ్డి గారి లాంటి నియంతను నువ్వెంత అని ప్రశ్నించిన తనను, చంపే ప్రయత్నాన్ని చేసిన ప్రతిఘటించిన తనను బీజేపీ నాయకత్వం కాదని అంటుందని అనుకోవడం లేదన్నారు. బీజేపీ అభ్యర్థిగా జగన్ మోహన్ రెడ్డి గారిని సమూలంగా రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీసే విధంగా కూటమిని గెలిపించుకుందామని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. కొంత మంది పోలీసు అధికారులు ఇంకా అధికార పార్టీ నాయకుల బూట్లు నాకుతున్నారని రఘురామకృష్ణ రాజు గారు ఫైర్ అయ్యారు. పోలీసులతో పాటు వాలంటీర్లు కూడా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లను విధుల్లో నుంచి తప్పించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని అన్నారు.