నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైకాపాకు ఎందుకు రాజీనామా చేశారు, అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సంజీవ్ కుమార్ పార్టీని ఎందుకు వీడారో సాక్షి దినపత్రికలో రాస్తే బాగుంటుందని రఘురామకృష్ణ రాజు అభిప్రాయపడ్డారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి వ్యక్తి అని ఆయన్ని కూడా ఎందుకు భరించలేకపోయారంటూ ప్రశ్నించారు. తాను అనుకున్నది చేయలేకపోయానని శ్రీకృష్ణదేవరాయలు గారు ఆవేదన వ్యక్తం చేశారంటే, ఆయన అనుకున్నది మీరు చేయనివ్వలేదనే అర్థం కదా అంటూ నిలదీశారు.
నిడదవోలు సీటు కోసం, ఇంకేదో సీటు కోసం కుస్తీలు పడుతున్నారని, వారు వెళ్ళిపోయారు… వీరు వెళ్లిపోయారన్న వార్తలు ఇప్పుడు వైకాపాలో కామన్ అయ్యాయని, ఎంపీ బాలశౌరి గారి వికెట్ డౌన్ అయిన తర్వాత, టీడీపీతో పొత్తు వల్ల జనసేనకు అన్యాయం జరుగుతుందని సాక్షి దినపత్రిక ఆందోళన చెందుతూ వార్త కథనం రాయడం విడ్డూరంగా ఉందని అన్నారు. రోజుకోక నాయకుడు వైకాపాను ఎందుకు వీడుతున్నారో అన్నదానిపై మాత్రం సాక్షి దినపత్రిక వార్తా కథనాలను రాయడం లేదని అన్నారు. వైకాపాలో కేశినేని నాని గారు చేరారని చెబుతున్నప్పటికీ, బడ్జెట్ సమావేశాల తర్వాత ఆ పార్టీకి గట్టి షాక్ తగలనుందని రఘురామకృష్ణ రాజు అన్నారు.