ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. మంగళ, బుధ వారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
మరోవైపు ఆదివారం రోజున కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాత్రి 9 గంటల వరకు కాకినాడ జిల్లా శంఖవరంలో అత్యధికంగా 60.25 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇక వర్షాకాలంలోనూ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం విశాఖపట్నం, తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, ఒంగోలు, నెల్లూరు, కావలి, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.