ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి) తాజాగా మరో ఆడియో రిలీజ్ చేశారు. మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో తాను ఈ కేసులో సిట్ విచారణకు హాజరవుతానని తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్ కసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మధ్యంత బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను వారానికి వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలోనే మంగళవారం రోజు తాను విచారణకు హాజరవుతానని రాజ్ కసిరెడ్డి ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. సిట్ అధికారులు ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేసినా రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కాలేదు. తాజాగా కోర్టులో అనుకూల తీర్పు రాకపోవడంతో విచారణకు హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఇదే కేసులో ఇటీవల విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరైన తర్వాత కూడా రాజ్ కసిరెడ్డి ఓ ఆడియో రిలీజ్ చేసి విజయసాయిరెడ్డి తనపై తీవ్ర ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు.