పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. సోమవారం ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు, సిబ్బంది ఆయణ్ను కోల్‌కతాలోని కమాండ్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పరీక్షించిన వైద్యులు ఆయనకు ప్రాథమిక పరీక్షలు చేసి గుండెలో బ్లాకేజ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని కమాండ్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్‌ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఆదేశించానని తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను కమాండ్ ఆస్పత్రి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. అయితే గవర్నర్ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉన్నదని రాజ్‌భవన్‌కు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.