ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్టును రద్దు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, న్యాయవాదులు సంబరాలు చేసుకుంటున్నారు. నల్ల చట్టాన్ని రద్దు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతిలో న్యాయవాదులు, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తెదేపా లీగల్ సెల్ అధ్యక్షుడు మద్దినేని వెంకటచలపతిరావు ఆధ్వర్యంలో న్యాయదేవత విగ్రహానికి పూలమాల వేశారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు చేసిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం న్యాయస్థానాల వద్ద ఉన్న వారికి స్వీట్స్ పంపిణీ చేశారు.
గన్నవరం నియోజవకర్గం రంగన్నగూడెం రైతులు ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దుపై సంబరాలు చేసుకున్నారు. రైతు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు నేతృత్వంలో రీసర్వే చేసిన పొలాల్లో వేసిన జగనన్న సర్వే రాళ్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి నాయకులు. రైతులు పామాయిల్ గింజలతో అభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. రీసర్వే పాసు పుస్తకాల ప్రతులను దహనం చేశారు.