ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన మాట తీరుతో ఎందరో అభిమానులను సంపాదించుకోవడమే కాదు విపక్షాలకు, ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న నాయకురాలు నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. వైఎస్ మరణం కంటే ముందు కాంగ్రెస్ లో జాయిన్ అయిన ఆమె ఆ తర్వాత జగన్ తో పాటు నడిచారు. జగన్ విపక్షంలో ఉన్న పదేళ్ళ పాటు కూడా ఆమె అన్ని విధాలుగా అండగా నిలిచారు. జగన్ మీద ఎవరు ఏ విమర్శ చేసినా సరే రోజా నుంచి ఘాటు సమాధానం ఉంటుంది.
ఆ విధంగా ఆమె పేరు తెచ్చుకున్నారు. అయితే ఆమెకు తొలి కేబినేట్ లో మంత్రి పదవి రావడం ఖాయమని అందరూ భావించారు. కాని అది సాధ్యం కాలేదు. ఆమెను పక్కన పెట్టి ఆ జిల్లాలో కొందరికి మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవులు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రోజా తనకు మంత్రి పదవి కావాలని విజ్ఞప్తి చేయగా కొందరు ఆమెకు అడ్డు పడుతున్నట్టు సమాచారం. వాస్తవానికి రోజా రంగంలోకి దిగితే పక్కన ఎవరు ఉన్నా సరే ప్రజలు చూడరు.
ఇప్పుడు అదే ఇబ్బంది కొందరికి ఎదురైంది. ఆమె ఉంటే తమకు ఎక్కడ ఇబ్బంది ఉంటుందో అని భావించి రోజాకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డం పడుతున్నారు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. రోజా మంత్రి పదవి తీసుకుంటే ఆమె సమర్ధత తమకు ఇబ్బందిగా మారుతుందని జిల్లాకు చెందిన ఒక సీనియర్ మంత్రి భావిస్తున్నారు అని టాక్ వినపడుతుంది. ఇక ఆమె కు ఇవ్వాల్సిన మంత్రి పదవి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనికి ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.