వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రంగా మారి.. తనను తానే వివాదం చేసుకున్న నాయకుడు ఎవరైనా ఉంటే.. ఆయన చింతమనేని ప్రభాకర్ అంటారు టీడీపీ నాయకులు. నిజానికి కొన్నాళ్లు ఆయనపైచిత్రమైన ప్రచారం జరిగింది. వివాదాల నాయకు డు అని గుగూల్‌లో సెర్చ్ చేస్తే.. కనిపించే పేరు చింతమనేని! అని ఆయనంటే గిట్టని టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. టీడీపీలో తనకంటూ ప్రత్యేక శైలిని అవలంభించుకుని ఎదిగిన చింతమనేని ఆదిలో మంచి పేరు సంపాయించుకున్నారు. అయితే, తర్వాత తర్వాత తన అధికారాన్ని వివాదాల దిశగా మళ్లించారు. ప్రతివిషయాన్ని వివాదం చేయడం, అహంకార పూరితంగా వ్యవహరించడం వంటివి ఆయనకు పెద్ద మైనస్‌గా మారిపోయాయి.
2009, 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున విజయం సాధించిన చింత మనేని తానే అన్నీ అన్నట్టుగా వ్యవహరించారు. తన వ్యవహారాలను ప్రశ్నించిన అధికారులపై కూడా ఆయన దాడులు చేయించారనే కేసులు ఉన్నాయి. నిజానికి టీడీపీ ప్రభుత్వంలోనే ఆయన దూకుడు ఎక్కువగా ఉంది. అయితే, అప్పట్లో అడ్డు కట్ట వేయాల్సిన చంద్రబాబు.. ఆయనను చూసి కూడా చూడనట్టు వ్యవహరించారు. సొంత సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, బలమైన అనుచరుగణం ఉండడం కారణంగా చంద్రబాబు చింతమనేనిపై దృష్టి పెట్టలేదు. పెట్టినా పట్టించుకోలేదు.
ఈ పరిణామాలు నియోజకవర్గంలో చింతమనేనిని ఓ హీరో అనుకునే రేంజ్‌కు తీసుకు వెళ్లాయి. ప్రతిపక్షంపైనా, స్థానికంగా అధికారులపైనా ఆయన చేసిన విమర్శలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేయడం, వాటిని వివాదాలకు కేంద్రంగా మార్చుకోవడం, కులం పేరు పెట్టి దూషించ డం వంటివి అప్పట్లో ఆయనకు మైనస్ అయ్యాయి. అదేసమయంలో వైసీపీ నేతలపైనా దాడులు చేశారనే కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం రాగానే చింతమనేనిపై లెక్కకు మిక్కిలిగా కేసులు నమోదయ్యాయి.
ఒకానొక దశలో 60 రోజుల పాటు జైల్లోనే ఉన్నారు. ఒక కేసులో కోర్టు బెయిల్ ఇస్తే.. మరో కేసులో అరెస్టులు సాగాయి. అలా తన రాజకీయ జీవితాన్ని వివాదంలోకి నెట్టుకున్నారు. మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. వ్యక్తిగత క్రమశిక్షణ లోపం కారణంగా ఎప్పటికప్పుడు వివాదం అవుతూ వచ్చారు. ఫలితంగా ఆయన ఈ పరిణామాలు సుదీర్ఘ రాజకీయ జీవితంపై తీవ్ర ప్రబావం చూపించడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో చింతమనేని స్పందించారు. వాస్తవానికి పార్టీ తరఫున చాలా మంది నాయకులు ఈ విషయంపై స్పందించారు. అచ్చెన్నను అరెస్టు చేయడాన్ని అందరూ తప్పుబట్టారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే, వీరందరికీ భిన్నంగా.. చింతమనేని కారులో నేరుగా రోడ్డు మీదకి వచ్చి.. కొవిడ్ రూల్స్‌కు భిన్నంగా నిరసనకు దిగారు.
దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలు కు తరలించారు. ఒక రోజు అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే అధికార వైసీపీపై మరోసారి విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో చింతమనేనికి షాక్ ఇస్తూ.. జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయింది. పాత కేసులను, పాత వివాదాలను తిరగదోడుతూ.. చింతమనేనిపై రౌడీ షీటు ఓపెన్ చేసేందుకు జిల్లా ఎస్పీ పరిశీలించేలా ఆదేశాలు జారీ చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే.. చింతమనేని తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయం. కొసమెరుపు ఏంటంటే.. చింతమనేని వ్యవహారాన్ని పార్టీ కూడా లైట్ తీసుకుంటుండడం. మరి ఏం జరుగుతుందో చూడాలి.