పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘సిత్రాంగ్’ తుపాను స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ తుపాను ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 21కి.మీ వేగంతో కదులుతుందని.. ప్రస్తుతం సాగర్ దీవికి 380కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది.
రేపు ఉదయానికి బంగ్లాదేశ్‌లోని టికోనా దీవికి సమీపంలో బరిసాల్ వద్ద తీరాన్ని దాటే సూచనలు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. అనంతరం వాయుగుండంగా, ఆ తదుపరి అల్పపీడనంగా బలహీనపడుతుందని పేర్కొంది. తుపాను ‘సిత్రాంగ్’ ప్రభావంతో తూర్పు తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తుపాను పరిసర ప్రాంతాల్లో 2.4 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడుతున్నట్లు ఐఎండీ వివరించింది. ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమబెంగాల్ తీర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.