తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో సీబీఐ ఛార్జిషీట్ లో కీలక అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు్న్నాయి. ఇప్పటికే పలువురు కీలక సాక్షులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలు బయటకు వచ్చి సంచలనం రేకెత్తించాయి. తాజాగా సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వివరాలు వెల్లడయ్యాయి.
వైఎస్ రాజారెడ్డి హత్య తర్వాత జరిగిన హింసను దృష్టిలో పెట్టుకొని వివేకా హత్య స్థలిలో లభించిన లేఖను తాను వచ్చే వరకు దాచిపెట్టమని చెప్పానని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. ‘ఉదయం 6.30గంటలకు వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్ చేసి ఘటనా స్థలిలో లేఖ ఉందని చెప్పారని రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. లేఖలో ఏముందని అడగ్గా.. డ్రైవర్ ప్రసాద్ బాధ్యుడిగా ఉందని కృష్ణారెడ్డి చెప్పారు. రాజారెడ్డి హత్య సమయంలో జరిగిన పరిణామాలతో పాటు ప్రసాద్‌కు ప్రాణహానిని దృష్టిలో పెట్టుకొని.. తాను వచ్చి వ్యక్తిగతంగా పోలీసులకు ఇస్తానని చెప్పారు. హత్యకు ముందు రోజు రాత్రి కడప ఎంపీగా తాను పోటీ చేయనున్నట్టు జమ్మలమడుగులో వివేకా చెప్పారుయ జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా అవినాష్‌కు మద్దతివ్వాలని ప్రభావతమ్మను వివేకా కోరినట్టు తెలిసింది.’ అని సీబీఐ వాంగ్మూలంలో రాజశేఖర్ రెడ్డి చెప్పారు.