మనకు బలం లేనప్పుడు.. పక్కవాడి బలాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తే. ఆటోమేటిక్‌గా మనం బలం పుంజుకున్నట్టే అవుతుందా ? అయితే.. ఈ సూత్రాన్నే ఇప్పుడు టీడీపీ నాయకులు పలు జిల్లాలలో అమలు చేస్తున్నారు. ఈ విషయం చంద్రబాబుకు తెలుసో తెలియదో చెప్పలేం కానీ.. పలు జిల్లాల్లో తమ్ముళ్లు మాత్రం రివర్స్ గేర్లో పార్టీ పైచేయి సాధించేలా.. చేస్తున్నారు. అంటే.. బలంగా ఉన్న అధికార పార్టీలో నాయకులకు నాయకులకు మధ్య జుట్టు ముడేసి.. వారిలో వారే తన్నుకునేలా చేయడం ద్వారా పరోక్షంగా తాము బలం పుంజుకునే క్రతువుకు తెరదీశారని తెలుస్తోంది.
ముఖ్యంగా కడప, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో టీడీపీ నాయకులు ఇదే తరహా రాజకీయాలు చేస్తున్నారని తెలుస్తోంది. తమకు అనుకూలంగా ఉన్న కొన్ని మీడియాల్లో వైఎస్సార్ సీపీ నేతలపై వ్యతిరేక వార్తలు రాయించి.. వాటిని అదే పార్టీకి చెందిన మరో నేతపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై మాట్లాడిన కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డిపై తాను వ్యతిరేక వ్యాఖ్యలు చేశానంటూ.. ఓ వర్గం మీడియాలో కథనాలు వచ్చాయని, కానీ, అవన్నీ తప్పులేనని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.
ఇక, కర్నూలులో బైరెడ్డి సిద్దార్థపైనా టీడీపీ నేతలు తెరచాటు మంత్రాంగం నడుపుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యే ఆర్థర్‌తో కలిసి విష ప్రచారానికి తెరదీశారు. అంటే.. బైరెడ్డి దూకుడు తగ్గితే.. తమ హవా పెంచుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, కృష్ణా జిల్లాలోనూ గన్నవరం నియోజకవర్గంలో ఇదే తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే వంశీని రెచ్చగొట్టేలా కథనాలు రాయిస్తున్నారట కొందరు తమ్ముళ్లు. దీంతో ఆయన రెచ్చిపోవడం, వైఎస్సార్ సీపీలోనే కలహాలకు కారణం అవుతోంది. మొత్తానికి టీడీపీ నేతలు చేస్తున్న ఈ రాజకీయాలు ఎన్నాళ్లు సాగుతాయో చూడాలని అంటున్నారు వైస్సార్ సీపీ నేతలు.