ఎన్టీఆర్ తోనే తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీ 43వ ఆవిర్భావం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేశారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ చంద్రబాబు నేతృత్వంలోనిదని, వెన్ను పోటు నుంచి పుట్టిందని ఎద్దేవా చేశారు. నందమూరి తారకరామరావు టీడీపీని స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నరో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని అవకాశవాద రాజకీయాలను తెరతీశారని అంబటి ఆరోపించారు. చంద్రబాబు పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లారా..? అని ప్రశ్నించారు. అన్ని పార్టీల జెండాలు ఆయన పక్కన పెడితేగాని టీడీపీ జెండా ఎగరలేని ఎద్దేవా చేశారు. సింగిల్ గా ఎన్నికలకు వెళ్లలేని పార్టీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నడుస్తున్న పార్టీ టీడీపీ అని మాజీ మంత్రి లోకేష్ విమర్శించారు.