ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో పాస్టర్ ది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, హత్య అని క్రైస్తవ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు.. ఈ కేసులో విచారణ ముమ్మరం చేసి నిజాలు నిగ్గు తేల్చాలని ఆందోళన చేస్తున్నాయి. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసును సీబీఐ అప్పగించాలని క్రైస్తవ సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన క్రైస్తవ జేఏసీ నేతలు మృతి పై అనుమానం వ్యక్తం చేస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాలను చంపేస్తానని చాలాసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. అదేవిధంగా పగడాల, ఆయన కుటుంబ సభ్యుల కాల్ డేటాను పోలీసులు క్షుణ్ణంగా విశ్లేషించాలని కోరారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఏం జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పారు. ప్రవీణ్ మృతితి కేసులో తమకు చాలా అనుమానాలున్నాయని.. వాటిని క్లియర్ చేసేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేయాలన్నారు.