తిరుమలకు వచ్చే భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకుని భక్తి భావంతో తిరుగు ప్రయాణం కావాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు గత ఐదేళ్లలో దూరమైన సౌకర్యాలను కొత్త ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. దివ్యదర్శనం టోకెన్లు, క్యూలెన్లు నియంత్రణ, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ పునఃప్రారంభమయ్యాయి. ఐదేళ్లుగా మూసివేసిన నారాయణగిరి ఉద్యానవనాల షెడ్లు, వైకుంఠం క్యూ కాంపెక్ల్స్1లో కంపార్ట్మెంట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురావడంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి తప్పింది.
నారాయణగిరి ఉద్యానవనాల షెడ్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో కంపార్ట్‌మెంట్లు నిండిన తర్వాతే క్యూలైన్లలో బయట భక్తులు వేచి ఉంటున్నారు. వారాంతరాలు మినహా ఇప్పుడు భక్తులెవ్వరూ క్యూలైన్లు బయట కనిపించడం లేదు. మరోవైపు దివ్యదర్శనం టోకెన్లు పాక్షికంగా పునరుద్ధరించడంతోపాటు అక్రమాలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది చంద్రబాబు సర్కార్. పాత పద్ధతులన్నీ పునరుద్ధరించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.