ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాన్ని కూడా టిడిపినే సొంతం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి ముద్దు కృష్ణ రెడ్డి 6,267 ఓట్ల మెజారిటీతో విజయం అందుకున్నారు. ఆయనకు 12,780 ఓట్లు, వైసిపి అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు నమోదు అయ్యాయి. మొత్తం 20,467 ఓట్లు పోల్ కాగా, 602 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. 29 ఓట్లు నోటాకు పడ్డాయి. ఇక మొత్తంగా ఒంటిమిట్టలో ముద్దు కృష్ణారెడ్డి జెడ్పిటిసి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో టిడిపి శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పులివెందులలో కూడా జడ్పిటిసి స్థానాన్ని టిడిపి కైవసం చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో జడ్పిటిసి స్థానంలో టిడిపి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి విజయం సాధించారు. ఇదిలా ఉండగా… టిడిపి అభ్యర్థి లతా రెడ్డి గెలవడంతో మంత్రి సవిత సంతోషం వ్యక్తం చేశారు. పులివెందులలో స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగానే ప్రజలకు స్వేచ్ఛ లభించిందని అన్నారు. వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. దీంతో సవిత చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.