రాష్ట్రంలో బీజేపీ తరఫున వాయిస్ వినిపించిన సీనియర్లుగా. దూకుడు పెంచిన నాయకులుగా పేరు తెచ్చు కున్న వారు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. వారి ఊసు, ధ్యాస కూడా ఎక్కడా వినిపించడం లేదు.. కనిపిం చడమూ లేదు. దీంతో అసలు ఏం జరిగిందనే విషయం ఆసక్తిగా మారింది. బీజేపీలో రాష్ట్ర నేతలుగా ఉన్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, మాజీ ఎంపీ కంభం పాటి హరిబాబులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు చక్రం బాగానే తిప్పారు. అప్పట్లో కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు.. మంత్రాంగం బాగానే చేశారు. ఆయన ఎప్పుడు ఏపీకి వచ్చినా.. దగ్గరే ఉండి అన్నీ చూసుకునేవారు.
రాష్ట్రంలోనూ గట్టిగానే వాయిస్ వినిపించారు. అయితే, వెంకయ్య ఉప రాష్ట్రపతికావడం, ఎన్నికల్లో బీజేపీ తీవ్రంగా దెబ్బతినడంతో వీరు మౌనం వహించారు. ఇక, వీరి తర్వాత పార్టీలోకి వచ్చిన మాజీ టీడీపీ నాయకులు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఓ ఆరు నెలల కిందటి వరకు బాగానే మాట్లాడారు. అమరావతి ఉద్యమం తెరమీదికి వచ్చినప్పుడు సుజనా ఏకపక్షంగా వ్యాఖ్యలు సంధించారు. ఇంకేముంది.. ఒక అంగుళం కూడా అమరావతి కదలదు.. ప్రధాని తరఫున నాదే హామీ అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇక, సీఎం రమేష్ కూడా ఇదే రేంజ్‌కు తగ్గకుండా వ్యవహరించారు.
దీంతో బీజేపీలో ఫర్వాలేదు.. మంచి నేతలు ఉన్నారు అనే టాక్ వచ్చింది. కానీ, ఏమైందో ఏమో.. తెలియ దు కానీ.. ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇక, ఇదే పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కూడా ఎక్కడ ఉన్నారో.. కూడా తెలియడం లేదు. పార్టీ తరపున మంచి నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. పైగా ఆర్ ఎస్ ఎస్ భావజాలం మెండుగా ఉన్న నేత. అయితే, ఆయన కుమారుడు మాత్రం వైసీపీలోకి చేరిపోయారు.
గోకరాజు బీజేపీలో ఉండి ఆయన కుమారుడిని మాత్రం పార్టీ కండువా మార్పించారు. ఇక గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పైడికొండల మాణిక్యారావు మృతి చెందారు. ఏదేమైనా ఒకనాడు రాష్ట్ర పార్టీకి జీవం అనదగ్గ నేతలుగా ఉన్న వీరంతా మౌనంగా ఉండడం.. పార్టీలోనే కాకుండా రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.