స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నిరాధారమైంది : సీమెన్స్ మాజీ ఎండీ

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ప్రస్తుతం మంటలు రాజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడు అరెస్ట్‌పై సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ స్పందించారు. న్యూఢిల్లీలో సుమన్ బోస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నిరాధారమైందని అన్నారు. 2021లోనే ప్రాజెక్టుకు సంబంధించిన శిక్షణ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. ఒక్క కేంద్రాన్ని కూడా సందర్శించకుండా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను బోగస్ అని ఎలా ముద్ర వేస్తారని ప్రశ్నించారు. విజయవంతమైన ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు రావడంపై ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. తనపై తీవ్ర ఆరోపణలు చేయడంపై కూడా సుమన్ బోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము ట్రైనింగ్ ఇచ్చిన పరికరాలు కనిపిస్తున్నాయని, సెంటర్స్ కనిపిస్తున్నాయని.. చివరగా ట్రైనింగ్ అయిన వాళ్ళు, తద్వారా ఉద్యోగాలు వచ్చిన వారు కనిపిస్తున్నారని సుమన్ బోస్ చెప్పారు. 90:10 డీల్ మార్కెటింగ్‌లో భాగమని, అన్ని వివరాలను కోర్టులో అందజేస్తామని బోస్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో ఎలాంటి మనీలాండరింగ్ జరగలేదని, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సీమెన్స్ మధ్య జరిగిన ఒప్పందం సాఫ్ట్‌వేర్‌కు డిమాండ్‌ను పెంచే లక్ష్యంతో ఉందని.. ఇది మార్కెటింగ్ వ్యూహాలలో భాగమని, ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయని వివరించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై ఉన్న కేసు నిరాధారమని బోస్ అన్నారు. 2016లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం విజయవంతమైన ప్రాజెక్టుగా ప్రకటించిందని.. ఈ పథకంలో ఎలాంటి అవినీతికి తావులేదని, ప్రాజెక్టు సాధించిన సానుకూల ఫలితాలపై దృష్టి సారించాలని కోరారు. జీవితంలో తనకు లభించిన గౌరవాన్ని నిలబెట్టుకునేందుకే మీడియా ముందుకు వచ్చానని బోస్ వివరించారు.

2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. అప్పటి సీఎం చంద్రబాబు యువత సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించాలనే ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారని చెప్పారు. అందరికి ఏపీలో ఉద్యోగాలు లభించవని.. ఎక్కడున్న వారు ఏపీ రాష్ట్రానికి ప్రపంచ అంబాసిడర్‌లుగా ఉంటారని చంద్రబాబు ఆ సమయంలో చెప్పారని తెలిపారు. 40 ప్రాంతాల్లో 200 ల్యాబ్‌లను ఏర్పాటు చేయడంతోపాటు 2021 నాటికి 2.32 లక్షల మంది నైపుణ్యం సాధించారని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని బోస్ పేర్కొన్నారు. 2021లో ఈ ప్రాజెక్టు విజయాన్ని ధృవీకరిస్తూ ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి లేఖ కూడా వచ్చిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news