విభేదాలను పక్కన పెట్టి పార్టీ విజయానికి కృషి చేయండి : మల్లికార్జున ఖర్గే

-

విభేదాలు, వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి అహర్నిశలు పనిచేసి పార్టీ విజయానికి ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడ‌బ్ల్యూసీ) సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ నాయ‌కులు స్వీయ నియంత్రణ పాటించాలనీ, పార్టీకి వ్యతిరేకంగా మీడియాకు ప్రకటనలు చేయడం మానుకోవాలని, తద్వారా పార్టీ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పార్టీ ఏకమై నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఈ సమావేశంలో ఖర్గే పిలుపునిచ్చారు. సంస్థాగత ఐక్యత ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ఆయన, కర్ణాటకలో మాదిరిగా క్రమశిక్షణ ద్వారా కాంగ్రెస్ తన ప్రత్యర్థులను ఓడించగలదని అన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారనీ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లలో కాంగ్రెస్ సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని ఖర్గే అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పార్టీ పూర్తి బలంతో, స్పష్టమైన సందేశంతో ముందుకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.

‘ముందున్న సవాళ్ల గురించి మనందరికీ తెలుసు. ఈ సవాళ్లు కేవలం కాంగ్రెస్ పార్టీవి మాత్రమే కాదు. అవి భారత ప్రజాస్వామ్య మనుగడకు, భారత రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించినవి’ అని ఖర్గే పేర్కొన్నారు. పార్టీకి విశ్రాంతి ఇచ్చే సమయం ఇది కాదని ఆయన అన్నారు. గత పదేళ్ల బీజేపీ పాలనలో సామాన్యులు ఎదుర్కొంటున్న సవాళ్లు రెట్టింపయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. పేదలు, రైతులు, కూలీలు, మహిళలు, యువత సమస్యలను పరిష్కరించడానికి ప్రధాని నిరాకరిస్తున్నార‌ని అన్నారు.

హైదరాబాద్ లో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తూ దేశం ఎదుర్కొంటున్న పలు కీలక అంశాలను ప్రస్తావించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా భారత జాతీయ కాంగ్రెస్ పాత్రను నొక్కి చెప్పిన ఖర్గే, సాధారణ ప్రజల ఆందోళనలు, సమస్యలను పరిష్కరించడానికి పార్టీ కట్టుబడి ఉందని స్ప‌ష్టం చేశారు. దేశ ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఖర్గే వివిధ అంశాల్లో మోదీ ప్రభుత్వ పనితీరును తప్పుబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news