ఆంధ్రప్రదేశ్లో నూతన సర్కారు కొలువుదీరింది. మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం చంద్రబాబు తన నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు శాఖల కేటాయింపుపై కసరత్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించాలనే అంశంపై తర్జన భర్జన జరగనుంది. పోలవరం, అమరావతి నిర్మాణాలకు చంద్రబాబు సర్కార్ హై ప్రయార్టీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇరిగేషన్, పట్టణాభివృద్ధి శాఖల పరిధిలో పోలవరం, అమరావతి నిర్మాణాల వ్యవహారం ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ కీలక శాఖలను ఎవరికి అప్పగిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.
పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కీలక శాఖలను ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హోం శాఖ పవన్కు వెళ్తుందనే విస్తృత ప్రచారం జరుగుతుండగా.. పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్, వ్యవసాయం, ఇంధన శాఖలపై టీడీపీ వద్దే ఉంటాయా..? లేక జనసేనకు వెళ్తుందా..? అనేది చర్చనీయాంశమైంది. ఓ వైపు లోకేషు విద్యాశాఖ అని ప్రచారం జరగుతుండగా.. మరోవైపు గతంలోని శాఖలే కేటాయించవచ్చనే ప్రచారాలు జరుగుతున్నాయి. ఆర్థిక శాఖ పయ్యావులకు లేదా ఆనంకు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వంగలపూడి అనితకు కీలక శాఖలు కట్టబెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని కూటమి కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. పట్టణాభివృద్ధిని నారాయణకు కట్టబెడతారా..? లేక సీఎం వద్దే ఉంచుకుంటారా..? అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు తిరుమలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ లోపే శాఖలు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఎవ్వరెవ్వరికీ ఏయే శాఖ కేటాయిస్తారో వేచి చూడాలి మరీ.