తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 23వ నుంచి జనవరి 1వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. పదిరోజుల పాటు భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
23వ తేదీన వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారం తెరవనున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. జనవరి ఒకటిన రాత్రి 12 గంటలకు ఈ ద్వారం మూసివేస్తామని చెప్పారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.
22వ తేదీకి సర్వదర్శనం టోకెన్లు రద్దు చేశామని.. భక్తులు తిరుమలకు వచ్చి క్యూలైన్లలో నిరీక్షించకుండా, తిరుపతిలోనే సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. 22వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి టోకెన్ల జారీ మొదలవుతుందని.. తిరుపతి పరిధిలోని తొమ్మిది కేంద్రాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పది రోజుల కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం 4,23,500 టోకెన్లను నిరంతరాయంగా జారీ చేస్తామని వివరించారు.