విజయనగరం రైలు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు యుద్ధప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. రాత్రి 9 గంటల నుంచి.. దక్షిణ మధ్య రైల్వే, వాల్తేరు, తూర్పు కోస్తా రైల్వే సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఆర్పీఎఫ్, ఇతర సిబ్బంది.. ఇలా 7 సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి.
బోగీల తరలింపు, ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేశారు. బోగీలు తొలగించేందుకు విశాఖ నుంచి బాహుబలి క్రేన్ తీసుకొచ్చారు. సహాయక చర్యల్లో 276 మంది రైల్వే, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. వారికి స్థానికులు కూడా సహాయం చేస్తున్నారు. ఘటనాస్థలి నుంచి రైళ్ల బోగీలు తరలిస్తున్నారు. పలాస ప్యాసింజర్ 11 బోగీలు అలమండ స్టేషన్‌కు.. రాయగడ ప్యాసింజర్ 9 బోగీలు కంటకాపల్లి స్టేషన్‌కు తరలించారు. రెండు బోగీలు తీయడానికి రెండు గంటలకు పైగా సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు. దెబ్బతిన్న బోగీల వద్దకు వచ్చిన డాగ్ స్క్వాడ్ బోగీలను పరిశీలిస్తున్నాయి. ఘటనాస్థలి వద్ద అందుబాటులో రెండు అంబులెన్సులు ఉంచారు. ప్రమాద ఘటనపై అన్ని విభాగాల అధికారులు దర్యాప్తు చేపట్టారు.