తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిలను జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వారియర్స్ తీవ్రంగా ట్రోల్ చేశారని రఘురామకృష్ణ రాజు తెలిపారు. గతంలో తనను ఇదేవిధంగా ట్రోల్ చేసేవారని, ఇప్పుడు షర్మిలను అదేవిధంగా ట్రోల్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి ఆ పార్టీ నాయకత్వమే కారణమని సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొంటూ, అయినా షర్మిల గారు ఆ పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చారోనని పరోక్షంగా విమర్శించారనిఅన్నారు.
సజ్జల వ్యాఖ్యలతో జూనియర్ మిల్లెట్ రంగంలోకి దిగి సోషల్ మీడియాలో షర్మిల గారిని తీవ్రంగా ట్రోల్ చేయించారన్నారు. సజ్జల గారి వ్యాఖ్యలపై షర్మిల స్పందిస్తూ వెలుగులుంటే తెలంగాణ అని, చీకట్లు ఉంటే ఆంధ్రా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలపై స్పందించాలంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి షర్మిల గారు హితవు పలుకుతూ గట్టి కౌంటర్ ఇచ్చారని అన్నారు. షర్మిల గారిని అవసరం ఉన్నంత వరకు వాడుకొని వదిలేశారని, ఆమె జగన్ మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, ఎన్నో బూట్ల జతలు అరిగిపోయి ఉంటాయని అన్నారు. తెలంగాణలో జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రజలు అడ్డుకున్నారని, కానీ షర్మిల గారు తెలంగాణలో విజయవంతంగా పాదయాత్రను నిర్వహించారని అన్నారు.