ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తన వైఫల్యమే కారణమని అన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. లోపం ఎక్కడ ఉందో సమీక్షించుకుంటామని తెలిపారు. ఓటమిని వేరే వారి పైకి నెట్టడం తనకు అలవాటు లేదని చెప్పారు బొత్స సత్యనారాయణ. ఇక కేబినెట్ విస్తరణపై బొత్స కీలక ప్రకటన చేశారు. కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం, విచక్షణాధికారం అన్నారు.
దాని మీద మంత్రులం మాట్లాడటం కరెక్ట్ కాదని… ఎమ్మెల్సీ ఫలితాలకు మంత్రి వర్గ మార్పుకు సంబంధం ఏముంటుంది? అని తెలిపారు. విశాఖ నుంచి రేపటి నుంచే పాలనా ప్రారంభం కావాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు. వికేంద్రీకరణ అనేదే మా పార్టీ, ప్రభుత్వ విధానం అని.. టీడీపీ వంటి కొన్ని దుష్టశక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహించారు. కోర్టుల్లో సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతోందని వివరించారు.